పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి రావి రామనాధం బాబును తొలగించి ఆయన స్థానంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను నియమించబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మార్టూరు మండలంలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకుండానే మార్టూరు ప్రధాన రహదారిపై బుధవారం ఉదయానికల్లా ఆమంచి ఫ్లెక్సీలు వెలిశాయి. రెండు రోజుల క్రితం ఇసుకదర్శిలో రావి రామనాథం బాబుకు సన్నిహితులైన నాయకులు సమావేశమై తమ నేతకు అనుకూలంగా, ఆయననే పదవిలో కొనసాగించేలా ఎలా పావులు కదపాలా అన్న విషయమై చర్చించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రామనాథం బాబు వ్యతిరేకులు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలు చర్చించారు. మూడు గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు మినహా మిగిలిన వారంతా ఈ సమావేశంలో పాల్గొని సంఘటితంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వెనువెంటనే ఆమంచి ఫ్లెక్సీలు వెలియడంతో మండలంలోని వైసిపి శ్రేణుల్లో అత్యధికులు ఆమంచి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతం వెలువడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి