దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎమ్‌ఈ)కు రుణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచి, రుణాల చెల్లింపు కాలపరిమితిని 90 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని, క్రెడిట్ లింక్డ్ కేపిటల్ సబ్సిడీ పథకం పునరుద్దరించాలని వైయస్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతున్న ఈ తరుణంలోనే ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీలో 27%, ఎగుమతుల్లో 45% వాటా కలిగి ఉండటంతోపాటు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ ఫలాలు వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో చిన్న పరిశ్రమలు కీలకపాత్ర పొషిస్తున్నాయని అన్నారు.