చైనాలో కరోనా మళ్లీ విలయం సృష్టిస్తోందని వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. అయితే, భారత్ లో ఆ స్థాయిలో విజృంభణ ఉండకపోవచ్చని అన్నారు. దేశంలో విరివిగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడంతో మనకు ముప్పు తక్కువేనని, మన వ్యాక్సిన్ల పనితీరును దృష్టిలో ఉంచుకుని చూస్తే భయపడాల్సిందేమీ లేదని అదర్ పూనావాలా స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే కరోనా రాకాసి వైరస్ కు పుట్టినిల్లుగా నిలిచిన చైనాలో మరోమారు పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అధిక సంఖ్యలో ఉండడంతో ఇతర దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. చైనాలో ప్రధానంగా విజృంభిస్తున్నది బీఎఫ్-7 వేరియంట్ కాగా, ఈ వేరియంట్ తో భారత్ లో మూడు కేసులు నమోదయ్యాయి. కేంద్రం కూడా దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, కొవిషీల్డ్ వ్యాక్సిన్ సృష్టికర్త సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా తన అభిప్రాయాలను పై విధంగా పంచుకున్నారు.