నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో వెలుగు చూసిన నిధుల కుంభకోణంలో ఆ సంస్థ పూర్వపు జిల్లా మేనేజర్, ప్రస్తుత సూళ్లూరుపేట(తిరుపతి) ఆర్డీఓ కేఎం. రోజ్‌మాండ్‌ను బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 43 కోట్ల రూపాయలను అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులు కలిసి బొక్కేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం అక్టోబరు 1న వెలుగు చూడగా.. నవంబరు 4న వేదాయపాళెం పోలీసులు 32 మందికిపై కేసు నమోదు చేశారు. అయితే, అనూహ్యంగా ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. గత డీఎం పద్మతో సహా నలుగురు అసిస్టెంట్ మేనేజర్లు, స్టేజ్ టు కాంట్రాక్టర్‌తోపాటు మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. తాజాగా సూళ్లూరుపేట ఆర్డీవో కెఎం.రోజ్‌మాండ్‌ను బుధవారం ఉదయం 9 గంటలకు సూళ్లూరుపేటలోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, నెల్లూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఇక్కడ ఏసీబీ కోర్టులో ఆమెను హాజరుపరచగా, 15 రోజులపాటు రిమాండ్ విధించారు. రైతులకు, మిల్లర్లకు, ట్రాన్స్‌పోర్టులు, హమాలీలకు ఇవ్వాల్సిన బిల్లులను స్టేజ్-2 కాంట్రాక్టరైన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి, అక్కడ నుంచి మరో అకౌంట్‌కు, అక్కడ నుంచి సివిల్ సప్లయ్స్ డీఎం, ఇతర ఉద్యోగుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకున్న వైనం వెలుగు చూసింది.