వైసీపీ సంక్రాంతి సంబరాలలో లక్కీ డ్రా విజేతలకు బహుమతుల కోసమంటూ ఆ పార్టీ నేతలు వసూళ్ల పర్వం మొదలెట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మూడు రోజుల క్రితం నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సక్రాంతి సంబరాలు విజయవంతం చేయాలని కోరుతూ నాయకులు, ప్రజాప్రతినిధులకు లక్కీ డ్రా కూపన్లు అందించారు. జనవరి 12వ తేదీన డ్రా నిర్వహించి, విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటర్ సైకిళ్లు, 13 ఎల్‌ఈడీ టీవీలు, 75 మిక్సీలు అందించనున్నట్లు వారికి తెలియజేశారు. నియోజకవర్గ స్థాయిలో కోటి రూపాయలు లక్కీ డ్రా టికెట్ల ద్వారా వసులు చేయాలని నిర్ణయించారు. కూపన్ ధర రూ.100. స్థాయిని బట్టి 50 కూపన్లు ఉన్న పుస్తకాలను ఒక్కొక్కరికి 10, 5 చొప్పున అందించారు. కూపన్ల విక్రయం ద్వారా ఒక్కొక్క కౌన్సిలర్ రూ.20 వేల నుంచిరూ.25 వేల వరకు, నాయకులు స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ. 20వేలు వసూలు చేసి వైసీపీ కార్యాలయంలో అందించాలని నిర్దేశించారు. మంత్రి ఆదేశాలతో నాయకులు, ప్రజాప్రతినిధులు లక్కీ డ్రా టికెట్లను ప్రజలకు అమ్మెందుకు శ్రీకారం చుట్టారు.