ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబుల్లో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ట్యాబుల కొనుగోలులో కనీసం రూ.220 కోట్ల సొమ్ము దోచేశారని అన్నారు. సీఎం జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా తనకు తనే భారీ కానుక ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యార్ధులకు 5,18,000 ట్యాబులు పంపిణీ చేశారు. 8.7అంగుళాల స్క్రీన్ ఉన్న ఏ7 లైట్ మోడల్‌ను శాంసంగ్ పంపిణీదారుల నుంచి ఒక్కొక్కటీ రూ.13,262 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అమెజాన్ వంటి సైట్లలో ఈ మోడల్ ట్యాబ్ కేవలం ఒకటి రూ.11,999కి లభిస్తోంది. అదే 5 లక్షల ట్యాబులు ఒకేసారి కొంటే కనీసం రూ.9000కే అభించే అవకాశం ఉంది. ఈ లెక్కన ట్యాబ్‌ల కొనుగోలులో రూ.221కోట్ల అవినీతి జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం రూ.688కోట్లు వీటి కొనుగోలుకు వెచ్చించారు. ఇందులో మూడో వంతు దోచేశారు అని వాపోయారు.