ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం(అప్సా) అధ్యక్ష పదవిని వెంకట్రామిరెడ్డి నిలబెట్టుకున్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో అప్సా ఎన్నిక జరిగింది. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్‌లోని మొత్తం 1225 మంది ఉద్యోగులకు ఓటు హక్కు ఉండగా, 1162 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. అనంతరం ఫలితాలను వెల్లడించారు. అప్సా అధ్యక్ష స్థానంతోపాటు కార్యవర్గంలోని మరో 8 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష స్థానానికి జి.రామకృష్ణ, వెంకట్రామిరెడ్డి తలపడగా.. వెంకట్రామిరెడ్డి 288 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంకట్రామిరెడ్డికి 720, రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 8. ప్రధాన కార్యదర్శి స్థానానికి నలుగురు పోటీ పడగా... స్వతంత్రంగా పోటీ చేసిన శ్రీకృష్ణ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంకట్రామిరెడ్డి మద్దతుదారు కత్తి రమే్‌షకు 319, జంపాని రామారావుకు 306, పి.శ్రీకృష్ణకు 339 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష స్థానానికి నలుగురు పోటీ చేయగా సీహెచ్ ఎర్రన్న యాదవ్ 147 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంకట్రామిరెడ్డి మద్దతుదారు రాజేంద్రప్రకాశ్ ఓటమి పాలయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలి స్థానానికి నలుగురు పోటీపడగా చేయగా స్వతంత్రంగా పోటీ చేసిన సత్య సులోచన 52 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదనపు కార్యదర్శి స్థానానికి ఇద్దరు పోటీ చేయగా వి.గోపీకృష్ణ 252 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) స్థానానికి ఇద్దరు పోటీ పడగా....యు.మనోహర్ 162 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 6 స్థానాల్లో వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు గెలుపొందారు.