పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి - తాడేపల్లి కార్పోరేషన్ పరిధి చినకాకాని జాతీయ రహదారి వెంబడి నిర్మాణంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ను గురువారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందుబాటులోకి తీసుకువస్తే నేడు ఆయన తనయుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు 3500 రోగాలను ఆరోగ్య శ్రీ పధకానికి వర్తింపజేయడం ద్వారా ప్రతి పేదవానికి ఆరోగ్య భద్రతను ఇస్తున్నారని అన్నారు.
ఇక ప్రతి 30వేల జనాభాకు ఒక్కొక్క ఆరోగ్య కేంద్రం నిర్మించాలనే ప్రతిపాదనతో కార్పోరేషన్ పరిధిలో తొమ్మిది వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఒక్కో అర్భన్ హెల్త్ సెంటర్ కు రూ. 80లక్షలు కేటాయిస్తే నగరపాలక సంస్థ నిధులు మరో రూ. 50 నుండి 60 లక్షలను కేటాయించి పూర్తిస్థాయి హంగులతో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించామని త్వరలోనే చినకాకాని హెల్త్ సెంటర్ ను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి , ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.