కరడుగట్టిన నేరస్తుడు, బికిని సీరియల్ కిల్లర్ గా పేరుగాంచిన చార్లెస్ శోభరాజ్ (78) నేపాల్ లోని ఖాట్మండు జైలు నుంచి నేడు విడుదలయ్యాడు. అమెరికన్ టూరిస్టు కోనీ జో బ్రాంజిచ్, అతడి కెనడా ఫ్రెండ్ లారెంట్ కారియర్ లను హత్య చేసిన కేసులో చార్లెస్ శోభరాజ్ కు నేపాల్ కోర్టు జీవితఖైదు విధించగా, క్షీణించిన ఆరోగ్యం, మెరుగైన ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలంటే నేపాల్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో, చార్లెస్ శోభరాజ్ కు నేటితో జైలు జీవితం నుంచి విముక్తి కలిగింది. అతడిని నేపాల్ అధికారులు ఫ్రాన్స్ కు పంపించివేయనున్నారు.
ఛార్లెస్ శోభరాజ్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి వియత్నాం మహిళ. అయితే, భర్త నుంచి విడిపోయిన చార్లెస్ శోభరాజ్ తల్లి తర్వాత కాలంలో ఓ ఫ్రెంచ్ సైనికుడిని పెళ్లి చేసుకుంది. దాంతో చార్లెస్ శోభరాజ్ కు ఫ్రాన్స్ పౌరసత్వం లభించింది. 1970వ దశకంలో వరుస హత్యలతో చార్లెస్ శోభరాజ్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా, పాశ్చాత్యదేశాల నుంచి వచ్చే టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని, వారికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ముంచేయడం, అందినంత దోచుకోవడం, ఆపై వారిని తగలబెట్టడం చేసేవాడు. మొత్తమ్మీద 20 వరకు హత్యలు చేశాడు.
థాయలాండ్ లోని పట్టాయా బీచ్ లో ఆరుగురు మహిళలను ఇలాగే హతమార్చాడు. వారందరూ బికినీలు ధరించిన స్థితిలో విగతజీవులుగా పడివున్నారు. అప్పటినుంచి చార్లెస్ శోభరాజ్ కు బికినీ కిల్లర్ అనే పేరు స్థిరపడిపోయింది. ఓసారి ఢిల్లీలో ఫ్రెంచ్ విద్యార్థులకు మత్తుమందు ఇచ్చిన కేసులో తీహార్ జైలుకు వెళ్లాడు. అయితే తన పుట్టినరోజు అని చెప్పి జైలు అధికారులకు నిద్రమాత్రల పొడి కలిపిన స్వీట్లు, కేకు ముక్కలు ఇచ్చి, వారు మత్తుకు గురయ్యాక జైలు నుంచి పారిపోయాడు. ఈ ఘటన 1986లో జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన 22 రోజులకే శోభరాజ్ ను మధుకర్ జెండే అనే పోలీసు అధికారి గోవాలో పట్టుకున్నాడు. ఓ రెస్టారెంట్ లో శోభరాజ్ ను అదుపులోకి తీసుకోగా, ఆ రెస్టారెంట్ వారు ఆ పోలీసు అధికారి గౌరవార్థం జెండే ప్లాటర్ పేరుతో ఓ వంటకాన్ని కూడా అతిథులకు వడ్డించడం ప్రారంభించారు.
ఇక మళ్లీ జైలుకు వెళ్లిన చార్లెస్ శోభరాజ్ 1997లోవిడుదలయ్యాడు. ఫ్రాన్స్ కు వెళ్లిపోయాడు. తన హత్యలకు సంబంధించిన వివరాలను మీడియాకు భారీ మొత్తానికి అమ్ముకునేవాడు. తనను ఇంటర్వ్యూ చేసినందుకు అత్యధిక మొత్తాల్లో డబ్బు వసూలు చేసేవాడు. ఆ తర్వాత 2003లో చార్లెస్ శోభరాజ్ ను నేపాల్ లో ఓ కాసినోలో అరెస్ట్ చేశారు. అమెరికా, కెనడా టూరిస్టులను హత్య చేశాడని నిర్ధారణ కావడంతో కోర్టు జీవితకాల ఖైదు విధించింది. ఇప్పుడీ కేసులోనే శోభరాజ్ రిలీజ్ అయ్యాడు.
చార్లెస్ శోభరాజ్... వియత్నాం తల్లి, భారత్ కు చెందిన తండ్రికి పుట్టినప్పటికీ... వారు కొద్దికాలంలోనే విడిపోవడంతో సవతి తండ్రి అయిన ఫ్రెంచి సైనికుడి పెంపకంలో పెరిగాడు. అయితే, తల్లికి, ఫ్రెంచి సైనికుడికి పుట్టిన పిల్లలను బాగా చూసుకుంటూ, తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అతడిలో వయసుతో పాటే పెరిగి పెద్దదయింది.... క్రమేపీ అతడిని నేర ప్రవృత్తి వైపు నడిచేలా చేసింది.
ఇక, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తియ్యని తన మాటలతో ఎలాంటి వారినైనా సమ్మోహితులను చేయగల శోభరాజ్... నేపాల్ జైలులో ఉన్నప్పుడు తన న్యాయవాది కుమార్తె విహితా బిశ్వాస్ ను కూడా ఇట్టే వలలో పడేశాడు. అంతేకాదు, ఆమెను ప్రేమలో దింపి జైల్లోనే పెళ్లి చేసుకున్నాడు. ఇంతజేసీ... చార్లెస్ శోభరాజ్ కంటే విహితా బిశ్వాస్ 44 ఏళ్లు చిన్నది. చార్లెస్ శోభరాజ్ నేరమయ జీవితంపై పలు సినిమాలు కూడా వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa