నెల్లూరు జిల్లా కందు కూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎని మిది మంది మృతి చెందడం దురదృష్టకరమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి అన్నారు. కోడుమూరులోని పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల వైఫల్యం వలనే కందుకూరులో తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనకు పూర్తిగా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. టీడీపీ సభకు వచ్చే జనం భద్రతను పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏమి జరిగినా తమకు సంబంధం లేదని అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. టీడీపీ సభలకు జనం ఎక్కువ పోలీసులు తక్కువగా ఉంటున్నారని, అయితే వైసీపీ సభలకు మాత్రం జనం తక్కువ ఉన్నా పోలీసులు ఎక్కువగా ఉంటున్నారని అన్నారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలన్నారు. యువత, ప్రజలకు ఉపాధి లేదని, అభివృద్ధి ఏమాత్రం లేదని అన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సీబీలత, సర్పంచ్ భాగ్యరత్న, నాయకులు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవీంద్రగౌడ్, లక్ష్మయ్యశెట్టి, ఆదిశేషులు పాల్గొన్నారు.