‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... ఇక్కడ ప్రజలకే కాదు... దేశ ప్రధాని నరేంద్రమోదీకి కూడా అవాస్తవాలే చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధాల మూటలు’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. గురువారం ఆయన నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పోలవరానికి రూ.55,548 కోట్లు కావాలని అడిగారు. అయితే టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆ అంచనాలను రూ.47 వేల కోట్లకు కుదించిన సంగతి సీఎం మరుగున పెట్టారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు 76.9 కి.మీ.తో డీపీఆర్ సమర్పించామని సీఎం చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మెట్రో రైలుపై రివైజ్డ్ డీపీఆర్ కేంద్రానికి పంపలేదు. రాష్ట్రంలో ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేంద్రం రూ.195 కోట్లు ఇస్తే.. ఆ నిధులను దారిమళ్లించారు. రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఏడు రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయి. విశాఖపట్నం-కాకినాడ పీసీపీఐఆర్‌కు రాష్ట్ర వాటాగా రూ.5 వేల కోట్లు సమకూర్చాల్సి ఉంది. వాటిని ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు రావడం లేదు. విశాఖలో త్వరలో గ్లోబల్ టెక్ సమ్మిట్ పెడతామని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెబుతున్నారు. హెచ్‌ఎ్‌సబీసీని వెళ్లగొట్టామని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాకుండా చేశామని చెప్పి ఐటీ కంపెనీలను రప్పిస్తారా? నెల రోజుల్లో ఇన్ఫోసిస్ విశాఖ వస్తుందని మంత్రి సెప్టెంబరులో చెప్పారు. నాలుగు నెలలు అవుతున్నా దాని జాడ లేదు’’ అని సత్యకుమార్ విమర్శించారు.