హెల్త్ వర్సిటీ ప్రాంగణంలో ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 2గంటల వరకూ తనిఖీలు కొనసాగించారు. కీలకమైన రిజిస్టర్లతో పాటు పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌లో ఉన్న డేటాను కూడా కాపీ చేసుకున్నారు. 2011 నుంచి 2022 వరకూ ఏపీఎంసీలో ఎంతమంది వైద్యులు నమోదు చేసుకున్నారన్న వివరాలతో పాటు వారి చిరునామాలు, మెడికల్ కాలేజీల వివరాలు సేకరించారు. విదేశాల్లో చదివిన కొందరు విద్యార్థులు ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులు కాకుండానే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు నకిలీ సర్టిఫికెట్లు చూపించి కొన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిల్‌లో కొంతమంది దొంగ వైద్యులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం అందింది. దీనిపై విచారణ చేపట్టిన కేంద్రం కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించింది. తదుపరి విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. దీంతో అన్ని రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా గత శుక్రవారం ఏపీ ఎంసీలోనూ తనిఖీలు చేపట్టారు.