రాష్ట్రంలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ టీవీలు, వాల్‌టాప్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), ప్రొజెక్టర్ బేస్డ్ డీసీఆర్‌లను నెలకొల్పుతోంది. 50 వేలకు పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్‌ప్లస్ స్కూళ్లలో ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈ–కంటెంట్ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ సంస్థ ఈ–కంటెంట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా ఈ– కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయించింది. దీనివల్ల స్కూళ్లలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బాలలు వాటిని చదివేలా చేస్తున్నారు.