నర్సీపట్నం వైద్య కళాశాలకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం భీమబోయినపాలెంలో 52.15 ఎకరాల్లో ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో బోధనాస్పత్రి, వైద్య, నర్సింగ్ కళాశాలలు, వైద్య విద్యార్థుల హాస్టళ్లు, ఇతర నిర్మాణాలను అత్యాధునిక వసతులతో చేపట్టనున్నారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.470.05 కోట్లతో చేపట్టిన ఈ అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. ఏలేరు ఎడమ కాలువను తాండవ కాలువతో అనుసంధానం చేయడం ద్వారా కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాలను స్థిరీకరించనున్నారు.