సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం రూరల్, గార మండలాలు, మున్సిపల్ కార్పోరేషన్ చెందిన సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు, కన్వీనర్లు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాల ధ్యేయం ఒక్కటేనని ఆకలి,కన్నీరు,నిరాశ,నిస్పృహ లో ఉన్న పేదలకు అండగా ఉండడమే అని, ఇదే వైయస్ఆర్‌సీపీ ప్రధాన ధ్యేయం అని అన్నారు. పథకాల కారణంగా ఆర్థిక అసమానతలు తొలగి పోతాయన్న ఆలోచనతో పాటు సమాజంలో గౌరవం పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా వీటిని నిష్పక్షపాత ధోరణిలో మీరు అమలు చేస్తూ..లబ్ధిదారులతో పాటు అంతే గౌరవం పొందు తున్నారు అని చెప్పారు. మీకు మీ ప్రాంతాల్లో గౌరవం పొందేందుకు,అదే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు దక్కేందుకు ఒకే ఒక్క కారణం మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకపోవడమేనని అన్నారు.