బీసీలను కొందరు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బీసీలకు టీడీపీ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ తెచ్చి రూ.36 వేల కోట్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనని వెల్లడించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లను సీఎం జగన్ రెడ్డి 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. బీసీలు గట్టిగా మాట్లాడితే సైకో సీఎం అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బీసీలు, బీసీ వృత్తులను జగన్ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు పెట్టి పనికిరాని పదవులు ఇచ్చారని తెలిపారు.
ఇక, ఇసుక, సిమెంట్ రేట్లు పెంచి నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.1,200 కోట్లు మాయం చేశారని ఆరోపించారు.
బీసీలకు ఏం చేశారో సీఎం జగన్ చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మద్యం వ్యాపారాన్ని కూడా జగన్ రెడ్డే చేస్తున్నాడని పేర్కొన్నారు. దేశంలోని అందరి సీఎంల ఆదాయం రూ.317 కోట్లు అయితే, సీఎం జగన్ రెడ్డి ఒక్కడి ఆదాయం రూ.373 కోట్లు అని వివరించారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని అన్నారు.