రాష్ట్ర అభివృద్ది కోసం జనసేన పార్టీ నిబద్దతతో ముందుకు సాగుతుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆదివారం తెనాలి పార్టీ కార్యాలయం లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.... యువత, మహిళలు, రైతాంగం ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి పవన్కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు సాగి రాష్ట్రాన్ని ఉన్నత స్ధితిలో నిలుపుదామని ఆయన పేర్కొన్నారు. తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ప్రజల నుంచి అనేక సమస్యలు, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నానాటికి రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, పారిశ్రామిక వెనుకబాటు తనం మర్రి ఊడలా పాతుకుపోతుందని ఆయన తెలిపారు. త్వరలో పవన్కళ్యాణ్ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ది వెలుగులు నింపి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నాదెండ్ల అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్యకర్తలు కలసి కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.