నూతన సంవత్సరంలోనైనా సీఎం జగన్‌రెడ్డి మనసు మార్చుకొని అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజధానికి 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 1111వ రోజుకు చేరాయి. మందడం శిబిరంలో ముగ్గులు వేసి జై అమరావతి అంటూ నిరసన వ్యక్తం చేశారు. న్యాయదేవత విగ్రహానికి జేఏసీ నేతలు ధనేకుల రామారావు, అనుమోలు బాలమురళీకృష్ణ, దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్, ఆలూరి శ్రీనివాసరావు, కట్టా రాజేంద్ర పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఎక్కడికీ తరలదన్నారు. గత ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పకనే చెప్పిందన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రభుత్వం మూడు రాజధానులని గందరగోళం సృష్టించిందన్నారు. తోపుడు బండ్లపై అల్పాహారం అమ్మి నిరసనలు వ్యక్తం చేశారు. తట్టమట్టి కూడా వేయకుండా మూడేళ్ల నుండి అమరావతి అభివృద్ధిని ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు.