కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ డా.ఎన్.తులసీరెడ్డి విమర్శించారు. మంగళవారం ముదినేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు అప్పుల కుప్పలు పెంచి దేశాన్ని, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని, విభజన చట్టంలోని ప్రయోజనాలను 2014 నుంచి ఇప్పటివరకు ఏపీని పాలించిన ప్రాంతీయ పార్టీలు విస్మరించాయని, ఆయా పార్టీల నాయకులు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం నిర్దేశించిన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రానికి కేంద్రం నుంచి 24,350 కోట్లు రావాల్సి ఉండగా, 1750 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, 13వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 21,360 కోట్లు మాత్రమే భిక్షం వేసినట్లు మోదీ విదిల్చారని అన్నారు. ఏపీలో 1956 నుంచి 2014 వరకు లక్ష కోట్ల అప్పు చేయగా, 2014 నుంచి 2019 వరకు లక్షా 50 వేల కోట్లు, 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రా, అరాచక ఆంధ్రా, మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చిందే తప్ప అభివృద్ధిలో ముందంజ వేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేయాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి అన్నారు.