దేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు తెలిపారు. సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభల సందర్భంగా మంగళవారం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భీమవరంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం చారిత్రాత్మకం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలను దూకుడుగా అమలు చేసేందుకు పూనుకుంటుందని, దీనివల్ల రైతాంగం, కార్మికులపై పెద్దఎత్తున దాడి జరిగిందన్నారు. మూడు రైతు నల్ల చట్టాలు, నాలుగు లేబర్ కోడ్‌లు రైతు కార్మికుల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టామన్నారు. 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సంఘ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ధరలను నియంత్రించాలని ప్రజలపై భారాల ఆపాలని మహాసభలో తీర్మానించామన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్, డీఎన్‌వీడీ ప్రసాదు పాల్గొన్నారు.