ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించనున్నారు. గత శుక్రవారం పంత్ నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం తెలిసిందే. మోకాలులో లిగమెంట్ కట్ అయిపోవడంతోపాటు, నుదురు, వీపుపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం పంత్ ను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు, బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్ వైద్య రిపోర్ట్ లను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అతడ్ని విదేశానికి తరలించే ఆలోచన చేస్తున్నట్టు, ముఖ్యంగా లండన్ కు తరలించొచ్చని సమాచారం.
మరోవైపు చికిత్సతో పంత్ క్రమంగా కోలుకుంటున్నాడన్నది తాజా సమాచారం. మళ్లీ పంత్ బ్యాట్ పట్టాలంటే మోకాలు లిగమెంట్ సమస్య పూర్తిగా నయం కావాలి. ఈ విషయంలోనే అతడికి మెరుగైన వైద్యం అందించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. చికిత్సతో పంత్ కోలుకోవడాన్ని బీసీసీఐ పర్యవేక్షించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంత్ త్వరగా కోలుకోవాలని తోటి క్రికెటర్లు, అభిమానులు సైతం కోరుకుంటున్నారు.