తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ఇదిలా ఉంటే శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత జట్టు కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1–0తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొద్దిసేపు మైదానాన్ని వీడాడు. బౌలింగ్ చేస్తుండగా వెన్నునొప్పి రావడంతో అసౌకర్యానికి గురయ్యాడు. అలాగే, క్యాచ్ పట్టినప్పుడు కుడి కాలి కండరాలు పట్టేయడంతో మైదానం వీడి డగౌట్ చేరుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చినప్పటికీ బౌలింగ్ చేయకపోవడంతో అతని గాయం విషయంలో ఆందోళన మొదలైంది.
అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన హార్దిక్ తాను బాగానే ఉన్నానని చెప్పాడు. కొద్దిసేపు కండరాలు పట్టేయడం తప్పితే తనకు ఎలాంటి గాయం అవ్వలేదని తెలిపాడు. మ్యాచ్ కు ముందు సరిగ్గా నిద్రలేకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడంతో కొంత ఇబ్బంది కలిగిందన్నాడు. ఇక, చివరి ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ తో బౌలింగ్ చేయించడాన్ని పాండ్యా సమర్థించుకున్నాడు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పేందుకే ఇలా చేశానన్నాడు. ఈ మ్యాచ్ లో గొప్పగా రాణించిన యువకులను, ముఖ్యంగా అరంగేట్రం బౌలర్ శివం మావిని పాండ్యా ప్రశంసించాడు.