వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం అందుకేనని పరోక్షంగా ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారాన్ని ఉదహరించారు. పార్టీని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసేవారిపై వేటు తప్పదని అన్నారు.
ఇక, టీడీపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ నెలాఖరుకు పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి తీరుతామని బాలినేని వెల్లడించారు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనను సీఎం ముందుంచామని, ఆయన అంగీకరించారని తెలిపారు. రూ.200 కోట్లు కేటాయించగా, ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో 500 ఎకరాలు కేటాయించనున్నట్టు వివరించారు. యరజర్ల గ్రామంలో 818 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 24 వేల మంది సొంతింటి కల నెరవేర్చేందుకు అన్ని పనులు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారని బాలినేని మండిపడ్డారు.