ప్రతిపక్షాలు ప్రజల్లో తిరగకుండా అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ చీకటి జీవోలను తీసుకొచ్చారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న కుప్పంలో అడ్డుకున్న ఘటన ప్రజాస్వామ్యానికే చీకటిరోజని ఆయన అన్నారు. ఒక శాసనసభ్యుడిగా సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగేందుకు ఎవరి పర్మిషన్ కావాలని తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ప్రజాప్రతినిధులు సొంత నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబును చూసి జగన్ ఎంత భయపడుతున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.
నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ సరైన మార్గంలో పెడతానని చెపుతూ, ప్రజల్లో ధైర్యాన్ని కల్పిస్తూ చంద్రబాబు ముందుకు నడుస్తున్నారని.. చంద్రబాబు సభలకు తండోపతండాలుగా వస్తున్న ప్రజలను చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చారో... అప్పుడే రాష్ట్రం పతనం కావడం ప్రారంభమయిందని చెప్పారు. ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఎక్కడకు వెళ్లినా పోలీసులు తగిన భద్రతను, బందోబస్తును కల్పించాలని అన్నారు. పోలీసులు సరైన భద్రతను కల్పించి ఉంటే తొక్కిసలాటలు జరిగేవి కాదని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రతిపక్షాలకు రాజ్యాంగం హక్కు కల్పించిందని.... ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.