టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరి, అనంతపురం అర్బన నియోజకవర్గం నుంచి పవన కల్యాణ్ పోటీ చేస్తానంటే తన భుజస్కందాలపై ఆ బాధ్యత వేసుకుని, భారీ మెజార్టీతో గెలిపిస్తానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. టీడీపీ అనంతపురం అర్బన నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన కల్యాణ్.. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును రాజకీయ వ్యూహంలో భాగంగానే కలిశారని తాను భావిస్తున్నానన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందనేది టీడీపీ, జనసేన పార్టీల అభిప్రాయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అనంత అర్బన నుంచి పవన కల్యాణ్‌ను పోటీ చేసేందుకు తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తన సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. పవన కల్యాణ్‌ను దగ్గరుండి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.