ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విశాఖపట్నం జిల్లా, అరకులోయ, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పట్టు పరిశ్రమల శాఖకు చెందిన సుమారు 50 సెంట్ల స్థలాన్ని శనివారం రాత్రి సమయంలో ఆక్రమించి నిర్మాణాలకు కొందరు నాయకులు చేస్తున్న ప్రయత్నాలను వారు అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆదివారం విలేకరులతో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.... ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా చలామణి అవుతున్న కొందరు పాలక పక్ష నాయకులే ఆక్రమణలకు ప్రయత్నించారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎంతో విలువైన పట్టు పరిశ్రమల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు శనివారం రాత్రే ట్రాక్టర్లతో మెటీరియల్ వేశారని, ఈ విషయం తెలియడంతో తక్షణ చర్యల కోసం పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. దీంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడిందని సర్పంచ్ దాసుబాబు తెలిపారు. ఈ స్థలం సంరక్షణలో భాగంగా ఆదివారం ఉదయం పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇకపై ఇటువంటి ఆక్రమణలకు పాల్పడకుండా చూడాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.