విశాఖపట్నం ఎప్పుడొచ్చినా ఉద్వేగానికి లోనవుతానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విశాఖ వాసిగా జీవించాలన్నది తన చిరకాల కోరికని, ఇప్పటికే భీమిలి ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశానన్నారు. ఇక ఇల్లు కట్టుకోవడమే ఉందని.. అది కూడా పూర్తి చేసి విశాఖలో స్థిరపడాలని భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆ చిత్రం కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ.... విశాఖలో సముద్రంతో పాటు ఇతర ప్రాంతాలు తనకు చాలా ఇష్టమన్నారు. ఇక్కడి ప్రజలు శాంతికాముకులని కితాబునిచ్చారు. వాల్తేరు వీరయ్య కథ, టైటిల్‌ను డైరెక్టర్ బాబీ చెప్పగానే పాజిటివ్ ఫీలింగ్ కలిగిందన్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశానన్నారు. పక్కా కమర్షియల్ చిత్రమని, అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన రవితేజ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చక్కని సంగీతం అందించారన్నారు. సంక్రాంతికి ఒకే నిర్మాణ సంస్థ నుంచి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలవడం చరిత్రలో మొదటిసారని, రెండూ భారీ విజయాలు నమోదుచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కేథరిన్ థెరిస్సా, ఊర్వశి రహెతుల్, వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, దేవిశ్రీ ప్రసాద్, శేఖర్‌మాస్టర్, రామ్‌లక్ష్మణ్, కమెడియన్స్ సప్తగిరి, షకలక శంకర్, సుష్మిత, రచయిత కోన వెంకట్, శ్రీనివాసరెడ్డి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.