హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి స్థానిక జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. హత్యాయత్నం కేసులో వీరికి ఈ శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్ ను హత్య చేయడానికి వీరు యత్నించారని కోర్టు నిర్ధారించింది. అయితే హత్యా ప్రయత్నంలో విఫలమయ్యారని తెలిపింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. మహమ్మద్ పై నేరం రుజువు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెపుతున్నారు. మరోవైపు జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయబోతున్నారు.
సాలిహ్ పై 2009లో మహమ్మద్ మరి కొందరితో కలిసి పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అతడిని వెంబడించి కత్తులు, కటార్లు, కర్రలు, ఐరన్ రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్నాకులంకు తరలించి సకాలంలో వైద్యం అందించడంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.