ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) తాజాగా స్పందించింది. గతేడాది ప్రకటనలకు వెచ్చించిన సొమ్ముతో పాటు పెనాల్టీ మొత్తంతో కలిపి దాదాపుగా రూ.164 కోట్లు కట్టాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని పది రోజుల్లోగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించింది. గడువులోగా కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటోందని ఇందుకోసం గతేడాది రూ.97 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని ఎల్జీ నోటీసులు ఇచ్చారు.
అయితే, ఈ నోటీసులను ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో డీఐపీ స్పందిస్తూ.. ప్రకటనలకు వెచ్చించిన సొమ్ముతో పాటు పెనాల్టీ కూడా కలిపి మొత్తం రూ.164 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో ఆ మొత్తం కట్టకపోతే ఆప్ ఆస్తుల స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.