ఏపీలో పదవులు ఆశిస్తున్న వారికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయ్యే 23 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతలుగా ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 29న, మే 1న, జూలై 20న.. ఈ 23 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. అయితే.. ఖాళీ అవుతున్న అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార వైఎస్సార్సీపీ పట్టుదలగా ఉంది. అసెంబ్లీతో పాటు స్ధానిక సంస్ధల్లో ఉన్న బలం దృష్ట్యా.. ఈ 23 సీట్లలో వైసీపీ కనీసం 18 ఎమ్మెల్సీలను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
అటు సిట్టింగ్ స్ధానాల్ని కూడా వైసీపీ మరోసారి గెల్చుకునే అవకాశం ఉంది. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం దాదాపు హాఫ్ సెంచరీకి చేరుకుంటుంది. ఫలితంగా విపక్షాలపై మండలిలోనూ స్పష్టమైన ఆధిక్యంలో వైఎస్సార్సీపీ ఉంటుంది. అయితే.. ఎమ్మెల్యే ఎన్నికలతో పోలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం చాలా ఈజీ. ఖర్చు కూడా తక్కువే. దీంతో ఆశావహులు క్యూ కడుతున్నారు. ఎవరి దారిలో వారు.. పైరవీలు చేస్తున్నారు. గతంలో జగన్ హామీ ఇచ్చిన వారు.. ఇతర పదవులు ఆశించి.. అవకాశం దక్కనివారికి ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఎన్నికలు జరగనున్న స్థానాలు మినహా.. అన్నీ వైసీపీకి దక్కనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిలోనూ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందే ఛాన్స్ ఉంది. అయితే.. ఎన్నికలు లేకుండా పదవి పొందే అవకాశం రావడంతో.. డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్లపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చు. అందుకే పలు జిల్లాల్లో సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడున్నారు.
ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్ని.. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలతో పాటు స్థానిక సంస్థల కోటాతో భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన 7 స్థానాలు, గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే రెండు స్థానాలు అధికార వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడతాయి. అటు స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావాల్సిన 9 స్థానాల్లో కూడా వైసీపీనే విజయం సాధించే అవకాశలు ఉన్నాయి. జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల్ని పరిశీలించి.. అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీల్లో కూడా ఎక్కువభాగం బీసీలకే ఇచ్చే ఛాన్స్ ఉందని పొలిటికల్ కారిడార్‌లో చర్చ నడుస్తోంది.