విశాఖపట్నం నగరంలో ఏడాకులపాల చెట్లను జీవీఎంసీ హార్టికల్చర్ అధికారులు తొలగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నట్టు తరచూ ఫిర్యాదులు అందుతున్నందున వాటిని తొలగించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. శీతాకాలంలో ఏడాకులపాల చెట్లు పూలు పూస్తాయి. ఆ పూలు వాయు కాలుష్యానికి కారణంగా మారుతున్నాయని, ఆ గాలి పీల్చడం వల్ల ఆస్తమా సమస్య వున్నవారు ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. దీంతో నగర పరిధిలో వున్న ఏడాకులపాల చెట్లను తొలగించి వాటి స్థానంలో అందమైన పూలు పూసే ‘టబోబియా రోజియా’ అనే మొక్కలను నాటనున్నట్టు అధికారులు తెలిపారు. వాకర్లు, సీనియర్ సిటిజన్ల ఫిర్యాదు నేపథ్యంలో ముందుగా బీచ్‌రోడ్డులో వుడా పార్కు ఎదురుగా వున్న చెట్లను తొలగిస్తున్నామని, తర్వాత మిగిలిన ప్రాంతాల్లో తీసేస్తామని పేర్కొంటున్నారు.