మందస మండలంలోని అధికారులు సీజ్ చేసిన రైస్ మిల్లులను వెంటనే తెరిపించి కార్మికులను, రైతులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా కోశాధికారి అల్లు. సత్యనారాయణ డిమాండ్ చేసారు. శ్రీకాకుళంలో ఇందిరానగర్ కాలనీ సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మందస మండలంలోని సిద్ధిగాం, రాధాకృష్ణపురం, సారంగిపురం పరిధిలోని రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారంటీలు వెంటనే కట్టి మిల్లులు తెరిపించాలని డిమాండ్ చేసారు. మందస మండలంలోని సిద్ధూరు పరిధిలో గల రైస్ మిల్లు యాజమాన్యాలు బ్యాంక్ గ్యారంటీ కట్టలేదని జాయింట్ కలెక్టర్ పర్యటనలో ఋజువైనందున సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ కట్టకపోవడానికి కార్మికుల చేస్తున్న ఆందోళనే కారణమని యజమానులు సాకుగా చూపించారని, అది వాస్తవం కాదని అన్నారు. మిల్లులు సీజ్ చేయడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. కార్మికులతో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.