ధాన్యం కొనుగోళ్ళను జగన్ ప్రభుత్వం నిలిపివేయడంతో కోనసీమ రైతులు కన్నీరు పెడుతున్నారు. ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలతో కలెక్టరేట్‌ను ముట్టడించారు... కోనసీమ జిల్లాలో రైతులకు సంక్రాంతి కళ లేకుండా పోయింది. ప్రతి ఒక్క రైతు పండిన ధాన్యం అమ్ముకుని సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఈసారి కోనసీమ జిల్లా అన్నదాతల్లో విషాదం అలుముకుంది. కోనసీమ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే కేవలం రెండు లక్షల 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి.. ఇక ధాన్యం కొనమని చెప్పింది. కోనసీమ జిల్లాలో అనేక మండలాల నుంచి రైతులు ట్రాక్టర్లతో ధాన్యం తీసుకువచ్చి రైతు భరోసా కేంద్రాల వద్ద ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ధాన్యం కొనమని, తమ లక్ష్యం పూర్తి అయిందని, ప్రభుత్వం కూడా ధాన్యం కొనవద్దని చెప్పిందని అధికారులు చెబుతున్నారు.