పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీవాస్తవ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యలపై 31 అర్జీలు అందాయి. హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పరిధిలో బిసాయిపుట్టు నుంచి బొర్రా బాకూరుకు రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు అర్జీ సమర్పించారు. కొట్నాపల్లి పంచాయతీ పందిమెట్ట గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరారు. పెదబయలు మండలం సీకరి పంచాయతీ వెలపాలెం గ్రామానికి చెందిన కిముడు రాధ, రంభలకు అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని కోరారు. సంతారి పంచాయతీ కుక్కస గ్రామానికి చెందిన సింహాచలం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యారు.