తన వియ్యకుండు చంద్రబాబు ఊరైన నారావారి పల్లెకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా చ్చేశారు. నారావారిపల్లె టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం అని తెలిసిందే. గత కొన్నేళ్లుగా నారా, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు సంక్రాంతి వేడుకలను నారావారిపల్లెలోనే జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కాగా, ఇవాళ భోగి నేపథ్యంలో బాలకృష్ణ నారావారిపల్లెలో భోగిమంటలు వేశారు. గ్రామంలో హుషారుగా జాగింగ్ చేస్తూ సందడి చేశారు. ఓ భోగిమంట వద్ద చలికాచుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి అంటే మనకు సినిమాల పండుగ అని చమత్కరించారు. భోగిమంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల చుట్టూ ఆడవాళ్లు, మగవాళ్లు నృత్యాలు చేయడం, అత్తారిళ్లకు వచ్చిన అల్లుళ్లు, హరిదాసులు అటూ సంక్రాంతి విశిష్టతను వివరించారు.
మరుగున పడుతున్న మన సంస్కృతిని పునరుజ్జీవింపచేయడానికి ఇలాంటి పండుగలు ఎంతో అవసరం అని బాలయ్య అభిప్రాయపడ్డారు. పండుగలు అందరినీ కలుపుతాయని అన్నారు. భోగిమంటల్లాగానే అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
రాష్ట్రం సరైన నాయకత్వంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలందరకీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, కీర్తిప్రతిష్ఠలు, ఆయురారోగ్యాలు, పూర్ణాయుష్షు, నవగ్రహాల అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటున్నానని వివరించారు.