పండగపూట నిబంధనలకు విరుద్దంగా కోడిపందేలు, జూద కేంద్రాలను నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా కోడిపందేలు, జూదం ఆడిస్తూ వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, శాసనసభ్యులు, మంత్రులు ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున జూద కేంద్రాలను నిర్వహించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న పోలీసులపై సైతం దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
"తెలుగువారి సంస్కృతి, సాంప్రాదాయాలకు చిరునామాగా ఉన్న సంక్రాతి పండుగను జూద దినంగా మార్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నడిరోడ్లపై టెంట్లు వేసి, రోడ్లను బ్లాక్ చేసి కోడిపందాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జూదం లాంటి క్రీడలను జరగనివ్వమంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం రెండేళ్ల క్రితం జూదనిరోధక చట్టంపేరుతో తీసుకొచ్చిన బిల్లు ఏమైందో చెప్పాలి?
ఓట్లేసిన ప్రజల యోగక్షేమాలు, రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోవడానికి ఏమాత్రం తీరు బడిలేని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ కోసం మాత్రం రాత్రి పగలనే బేధం లేకుండా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అధికారపార్టీ నేతలు బరుల నిర్వహణకు ధరలు నిర్ణయిస్తూ సంక్రాతి మూడు రోజులపాటు జూద క్రీడలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? పోలీసులు ఇకనైనా స్పందించి కోడిపందాలు, జూద కేంద్రాలను నిలుపుదల చేయాలి. రాబోయే రెండు రోజులైనా సామాన్యులు సంక్రాంతి సంబరాలు సాఫీగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.