టీడీపీ నేతల భోగి మంటలను ఆర్పే క్రమంలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు గురవుతోంది. బూటు కాళ్లతో పోలీసులు భోగి మంటలు ఆర్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ధర్మవరంలో టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతులను వారు భోగిమంటల్లో వేసి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భోగి మంటలను తమ బూటు కాళ్లతో ఆర్పేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా 'సైకో పోవాలి... సైకిల్ రావాలి' అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. సంప్రదాయబద్ధమైన భోగి మంటలను బూటు కాళ్లతో ఆర్పడం దారుణమని విమర్శించారు.