సమాజం తలదించుకొనే ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది. జీవిత చరమాంకంలో కుమారుడు అండగా ఉంటాడని ఆ తల్లీ ఆశపడింది. నవ మాసాలు మోసి, కని, పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంది. ఏ కష్టం రాకుండా అతడిని చదివించి ప్రయోజకుడిని చేసింది. ఆ కుమారుడు మాత్రం తల్లీకి నరకం చూపించాడు. ఆస్తి కాజేసి అమ్మను ఇంటి నుంచి గెంటేశాడు. మానవత్వం మరిచి పండగపూట తల్లిని బయటకు తరిమేశాడు. దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లీ ఇంటి ముందు కూర్చొని కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన పతకమూరి లక్ష్మీరాజ్యం, సాంబశివరావుకు ఓ కుమారుడు, కుమార్తె. ఇద్దరిని చిన్నప్పటి నుంచి ఏ లోటు రాకుండా పెంచారు. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేశారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కుమారుడు క్రాంతి కుమార్ హైదరాబాద్‌లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం సాంబశివరావు చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు బీమా రూపంలో రూ.13 లక్షల వరకూ వచ్చాయి. ఫేక్ సంతకాలు పెట్టి తల్లికి తెలియకుండా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కుమారుడు క్రాంతి కుమార్ కాజేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి అమ్మ పేరిట ఉన్న ఎకరా పొలం, స్వగ్రామంలో ఇల్లునూ రాయించుకున్నాడు.
ఆ తర్వాత క్రాంతి కుమార్ అసలు నిజ స్వరూపం బయటపెట్టాడు. ఎలాంటి కారణం లేకుండా తన కుమారుడు, కోడల శ్వేత తనను దుర్భాషలాడేవరని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను కుమారుడి వద్ద ఉండలేక గత కొంత కాలంగా విజయవాడలో ఉన్న కూతురు కుసుమ కుమారి వద్ద ఉంటున్నానని తెలిపారు. ఆమెకు ఎక్కువ రోజులు భారం కాకుడదనే ఉద్ధేశ్యంతో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం పాలగుడుకు వచ్చిన కుమారుడు క్రాంతి కుమార్ వద్దకు చేరుకున్నానని తెలిపింది. కానీ తన కుమారుడు తనను తీవ్ర పదజాలంతో దుర్భషలాడి ఇంటి నుంచి బయటకు గెంటేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందే దిక్కుతోచని స్థితిలో కూర్చిండిపోయింది. ఆమె దీన స్థితిని చూసిన వారంతా ఇలాంటి కుమారుడు పుడితే ఎంత చనిపోతే ఎంత అని మండిపడుతున్నారు.