ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్నే తగ్గని ఎన్టీఆర్... ఉచితంగా ఆడుతున్న ఆ థియేటర్లో హౌజ్ ఫుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 11:07 AM

మనకు ఏడాది కిందటి సినిమా టీవీలో వచ్చినా వెంటనే రియోట్ తో వాటిని తిప్పేస్తాం. ఇలాంటి రోజుల్లో ఆ థియేటర్లో ఏడు నెలలుగా ఫ్రీ షోలు నడుస్తున్నాయి. రోజూ ఆయన సినిమాలే వేస్తున్నారు. అయినా కానీ.. ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. రోజూ జనం ఎగబడి మరీ వస్తున్నారు. కొత్త సినిమా రిలీజ్‌కు ఎలాంటి వాతావరణం ఉంటుందో.. అలాంటి వాతావరణమే అక్కడ రోజూ ఉంటుంది. ఎందుకో తెలుసా... అక్కడ వేస్తుంది ఎవరి సినిమాలో కాదు అన్నగారి సినిమాలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా.. తెనాలి పట్టణంలోని పెమ్మసాని థియేటర్‌‌లో ఆయన నటించిన అలనాటి మేటి చిత్రాలు వేస్తున్నారు. ఈ ఆటలన్నీ ప్రేక్షకులకు ఉచితం. ఎన్టీఆర్ సినిమాలు థియేటర్‌లో చూసేందుకు తెనాలితో పాటు గుంటూరు జిల్లా నలుమూలల నుంచి ప్రేక్షకులు, అన్నగారి అభిమానులు పెద్దఎత్తున వస్తున్నారు. అయితే.. ఏడు నెలలుగా రోజూ థియేటర్ దగ్గర సందడి వాతావరణమే కనిపించటం విశేషం.


ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఉత్సవాలను తెనాలిలో కనీవినీ ఎరగని రీతిలో చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌. ఈ విషయాన్ని అదే పట్టణానికి చెందిన తన మిత్రుడు, సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌తో చర్చించారు. వీళ్లకు తోడుగా ఎన్టీఆర్‌ అభిమాని, నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు కూడా నిలిచాడు. ఇంకేముంది.. ముగ్గురూ కలిసి ఉత్సవాల ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు చెప్పి ఉత్సవ కమిటీని ప్రారంభించారు.


ఉత్సవాల్లో భాగంగా నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలను సంవత్సరమంతా ప్రేక్షకుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం సుమారు 280కు పైగా చిత్రాలను డిజిటలైజేషన్‌ చేయించారు. వీటిని ఆడించేందుకు రామకృష్ణ థియేటర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు థియేటర్‌లో ఉచితంగా సినిమాలు ఆడిస్తారు. ఇక మిగిలిన శని, ఆదివారాల్లో మాత్రం ఎన్టీఆర్‌ నట, రాజకీయ ప్రస్థానంలోని వివిధ అంశాలపైన ప్రసంగాలు ఉంటాయి. బాలకృష్ణ ముఖ్య అతిథిగా 2022 మే 28న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు తెనాలిలో తెరలేచింది. మొదటి రోజున శ్రీ వేంకటేశ్వర మహత్యంతో ప్రారంభించి.. ఆత్మబంధువు, డ్రైవర్‌ రాముడు, బడిపంతులు, పాతాళభైరవి, మల్లీశ్వరి, భూకైలాస్‌, తెనాలి రామకృష్ణ... లాంటి అద్భుతమైన చిత్రాలెన్నో ప్రదర్శిస్తూ వస్తున్నారు.


అయితే.. అన్నగారి సినిమాలు చూడటానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు బస్ పాసులు తీసుకుని మరీ రావడం గమనార్హం. అనంతపురం జిల్లాకు చెందిన ఒక పెద్దాయన తెనాలిలోని బంధువుల ఇంట్లో ఉంటూ మనవరాలి సాయంతో థియేటర్‌కు వస్తూన్నరంటే.. అన్నగారి మీద అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆయనకు చూపు పూర్తిగా మందగించింది.. చూడలేకపోయినా సరే ఎన్టీవోడి డైలాగులు వింటే చాలు ఎంతో తృప్తి అంటున్నాడు ఆ వృద్ధ అభిమాని.


ఈ ఏడాది మే 28న ముగింపు వేడుకలను భారీగా నిర్వహించనున్నారు. తెలుగు వారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహించటం అందరి బాధ్యత అని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా.. సంవత్సరం మొత్తం ఒకే హీరో సినిమాలు ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com