ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కొరియాలో అరుదైన వ్యాధి... మరణించిన వ్యక్తి

international |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 08:50 PM

కరోనా వచ్చాక అనేక రకాల వ్యాధులు గురించి వినాల్సివస్తోంది. ప్రపంచాన్ని మరోసారి కరోనా భయం వెంటాడుతున్న వేళ.. దక్షిణ కొరియాలో అరుదైన వ్యాధి బారినపడి ఒక వ్యక్తి మరణించడం కలవరానికి గురిచేస్తోంది. మెదడును తినేసే ‘నెగ్లేరియా ఫౌలెరి’ అనే అమీబా కారణంగా ‘ప్రైమరి అమీబిక్‌ మెనింజోఎన్‌సైఫలిటిస్‌ (పీఏఎమ్‌) అనే వ్యాధి అతడికి సోకినట్టు గుర్తించారు. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఇటీవలే థాయ్‌లాండ్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. అక్కడ నాలుగు నెలలు ఉన్న అతడు డిసెంబరు 10న దక్షిణ కొరియాకు వచ్చినట్టు ది కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ (కేడీసీఏ) వెల్లడించింది. అదే రోజు సాయంత్రం నుంచి భరించలేని తలనొప్పి, జ్వరం, వాంతులు, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. లక్షణాలు కనిపించిన 11 రోజుల తర్వాత చనిపోయాడని తెలిపింది. కొరియన్ టైమ్స్ ప్రకారం.. దక్షిణ కొరియాలో నెగ్లేరియా ఫౌలెరి తొలి కేసు ఇదే. అయితే,దీని వ్యాప్తి గురించి మాత్రం కేడీసీఏ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.


కానీ, అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రకారం.. ఈ పరాన్న జీవి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడు వద్దకు చేరుకుంటుంది. దానిని ఆహారంగా భావించి అక్కడి కీలక ప్రాంతాలపై దాడి చేయడం వల్ల నాడీ వ్యవస్థా దెబ్బతింటుంది. దాంతో పీఏఎమ్‌‌గా మారుతుంది. దీని మొదటి లక్షణం భరించలేని తలనొప్పి.. అనంతరం మానసిక సమతౌల్యత దెబ్బతినడం, భ్రాంతికి గురవడం తదితర మార్పులు చోటుచేసుకుని బాధితుడు కోమాలోకి వెళ్లిపోతారు. 1962- 2021 మధ్య అమెరికాలో 154 మందిపై ఈ అమీబా దాడి చేయగా కేవలం నలుగురే బతికి బట్టగట్టారు. అయితే మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.


దీనిని నయం చేసే ఔషధాలు, టీకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. యాంఫోటెరిసిన్ B,అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథసోన్ వంటి కొన్ని రకాల ఔషధాలతో చికిత్స అందజేస్తారని సీడీసీ పేర్కొంది. దీనిని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం ఎందుకంటే అతివేగంగా వ్యాపిస్తుంది. బాధితడు చనిపోయిన తర్వాతే గుర్తించగలరు. దక్షిణ కొరియా వ్యక్తి విషయంలో ఇలాగే గుర్తించారు. అతడి పోస్ట్‌మార్టం నివేదికలో నెగ్లేరియా ఫౌలెరిగా తేలింది.


అమీబా వర్గానికి చెందిన ఏకకణజీవి అయిన నెగ్లేరియా ఫౌలెరి.. మంచి నీటి వనరులు, మట్టి, చెరువులు, సరసుల్లో ఉంటంది. అమీబాలు అన్నీ ప్రాణాంతకం కావు కానీ నెగ్లేరియా ఫెలోరి మాత్రం ప్రమాదకారి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు సరస్సులు, చెరువుల్లో నీరు వేడెక్కి ఆవిరిగా మారి పరిమాణం తగ్గిపోతుంది. ఏదైనా కారణం వల్ల అలాంటి మడుగుల్లోని నీరు ముక్కు ద్వారా లోపలికి వెళితే ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa