ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్నాడు. మైదానంలో దూకుడు పెంచేస్తున్నాడు. ఇదిలావుంటే భారత బ్యాటింగ్ లోతెంతో మరోసారి శ్రీలంక బౌలర్లకు తెలిసొచ్చింది. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది.
కోహ్లీ తన క్లాస్, మాస్ ఆటను చూపిస్తూ లంక బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మాజీ కెప్టెన్ స్కోరులో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దెబ్బకు లంక బౌలర్లు మరింత బెంబేలెత్తిపోయారు. కోహ్లీని అవుట్ చేయలేక, భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇదిలావుంటే కోహ్లీకిది వన్డేల్లో 46వ సెంచరీ. శ్రీలంకతో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేయడం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ 2 సెంచరీలతో అలరించాడు. కోహ్లీ మరో 3 సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును సమం చేయనున్నాడు. ఇక, శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.
కాసేపు నిలిచిన ఆట...
ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫీల్డర్ అషేన్ బండార తీవ్రంగా గాయపడ్డాడు. కరుణరత్నే బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన షాట్ ను ఆపేందకు లంక ఫీల్డర్లు బండార, వాండర్సే వేగంగా వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ ఢీకొనడంతో బండారకు గాయపడ్డాడు. అతడిని స్ట్రెచర్ పై బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అతడి మోకాలికి స్కానింగ్ తీయనున్నారు. అటు వాండర్సే కూడా గాయపడినా, అతడి పరిస్థితి ఫరవాలేదని తెలుస్తోంది. ఈ ఘటనతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa