రిమోట్ ఓటింగ్ మెషీన్ ను స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అయితే ఈసీ అనుసరించిన విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇదిలావుంటే వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పై విధంగా స్పందించారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించలేదని అన్నారు. పార్టీల అభిప్రాయాలు స్వీకరించకుండానే ఆర్వీఎమ్ తీసుకొచ్చారని పయ్యావుల విమర్శించారు. రాజకీయ పక్షాల ఏకాభిప్రాయం తర్వాతనే ఆర్వీఎమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ రిమోట్ ఓటింగ్ మెషీన్ పై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.