తాజాగా ఓ నివేదిక భారత్ లో ఐసీయూ చికిత్సపై ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. భారత్ లో ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్న రోగుల్లో సగానికి పైనే సెప్సిస్ తో బాధపడుతున్నట్టు ఓ అధ్యయనం పేర్కొంది. గడిచిన దశాబ్ద కాలంలో ఇలాంటి కేసులు గణనీయంగా పెరిగినట్టు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. సెస్పిస్ అన్నది ఇన్ఫెక్షన్ కు మన శరీరం నుంచి వచ్చే తీవ్రమైన స్పందన. సెప్పిస్ కండీషన్ లోకి రోగి వెళ్లడం అంటే ప్రాణాలకు ఎక్కువ రిస్క్ ఉన్నట్టు.
మన శరీంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ను సకాలంలో చికిత్సతో నియంత్రించనప్పుడు.. అది సెప్సిస్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి ఒకదాని తర్వాత ఒక అవయవానికి వ్యాపిస్తూ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది. అది అంతిమంగా ప్రాణాన్ని తీస్తుంది. ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెస్పిస్ కు కారణమవుతుంటాయి.
ఐసీయూల్లో చేరిన ఎవరికైనా సెప్సిస్ రిస్క్ ఉంటుంది. కాకపోతే 65 ఏళ్లు పైబడిన వారికి, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారికి, మధుమేహం, లంగ్ సమస్యలు, కేన్సర్, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి సెప్సిస్ రిస్క్ ఎక్కువ. తక్కువ, మధ్యాదాయ దేశాల్లో సెప్సిస్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు, అందులోనూ పుట్టిన శిశువులకు రిస్క్ అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఏటా లక్షలాది మందిని సెప్సిస్ కబళిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటూ 2017లోనే అంతర్జాతీయంగా అత్యవసర అప్రమత్తతను ప్రకటించింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2017 నాటి అధ్యయనం ప్రకారం.. అదే ఏడాది 4.9 కోట్ల సెప్సిస్ కేసులు నమోదు కాగా, 1.1 కోటి మంది మరణించారు. కేసుల్లో 41 శాతం ఐదేళ్లలోపు చిన్నారులకు సోకినవే. 42 శాతం ఐసీయూ కేసులు ఉన్నాయి. భారత్ లో సగం కేసులు ఐసీయూకు చెందినవిగా నాటి అధ్యయనం తెలిపింది.