ఉమ్మడి విశాఖ జిల్లాలో గుర్తింపు పొందిన ఎలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర గురువారం రాత్రి వైభవంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. రాజీవ్ క్రీడామైదానంలో జరిగే జాతరకు రెండు జిల్లాల నుంచి లక్షమందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాటు చేశామని కమిటీ చైర్మన్ కొఠారు సాంబ తెలిపారు. అమ్మవారి ఆలయంతో పాటు పురవీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జెయింట్ వీల్ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, తప్పెటగుళ్లు, నేలవేషాలు, కోలాటం, బుర్రకథ, రేలారే రేలా, సంగీత విభావరి, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నిర్వాహ కులు కొఠారు కొండబాబు, మడగల సత్యనారాయణ, ఎ. బి. ఎల్. రాజు తదితరులు తెలిపారు. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.