కార్మిక ప్రజా గర్జనతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎల్‌ఎంఎంఎం పార్కులో బుధవారం జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 705 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. ఢిల్లీకి వినిపించేలా లక్ష మందితో కార్మిక ప్రజా గర్జనను నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 20వ తేదీ ఉదయం ఆరున్నరకు నడుపూరు జంక్షన్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నామని, అలాగే ఉక్కు నిర్వాసిత కాలనీలు, పారిశ్రామిక ప్రాంతాలు, టౌన్‌షిప్‌లో సభలు, పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మాణం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీరుకొండ రామచంద్రరావు, గొందేసి ప్రభాకరరెడ్డి, ఎ. మసేన్‌రావు, బొడ్డు పైడిరాజు, దొమ్మేటి అప్పారావు, జి. గణపతిరెడ్డి, మహాలక్ష్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు.