రాష్ట్రంలో కార్మికులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తున్నాయని... పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపాలని కోరుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్లు అయినా మోదీ స్పందించ లేదన్నారు. కార్మికులంతా కలిసి ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్‌లో చలనం లేదని మండిపడ్డారు. ప్రైవేటుపరం అయితే అక్కడ భూమి లాక్కోవచ్చని జగన్ భావిస్తున్నారని ఆరోపించారు. మోదీకి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేని దుస్థితిలో జగన్ ఉన్నారన్నారు. విశాఖలో జనవరి 30న కార్మిక గర్జన చేపడతామని, సంఘీభావంగా 23, 24 తేదీలలో ఆర్డీఓ కార్యాలయాలు వద్ద, 25న కలెక్టర్ కార్యాలయాల వద్ద దీక్షలు చేడపతామని తెలిపారు. 30న విశాఖలో వేలాది మందితో గర్జన చేపట్టనున్నట్లు ప్రకటించారు. అదానీకి ఊడిగం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ కూడా అదానీకి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. అదానీ ఇచ్చే కమీషన్ల కోసం మోదీ, జగన్‌లు ప్రజల సంపద దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన విధంగా బుద్ది చెబుతారని రామకృష్ణ హెచ్చరించారు.