విశాఖ జిల్లా, కొయ్యూరు మండలంలోని సురేంద్రపాలెం గ్రామ శివారులో గల సారా బట్టీలపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు, ఎస్ఐ రాజారావుతో పాటు మహిళా పోలీసులు, సిబ్బంది గురువారం సాయంత్రం దాడులు చేశారు. 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 3 వేల లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేశారు. ఎస్ఐ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సారా తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టారు. సురేంద్రపాలెం గ్రామ శివారులో సారా తయారు చేస్తున్నట్టు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి సీఐ, ఎస్ఐ గురువారం దాడులు చేశారు. సారా తయారీకి వినియోగించే 3 వేల లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేసి, 20 లీటర్ల సారా సీజ్ చేశారు. ఈ దాడుల్లో మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు, కొయ్యూరు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.