శాప్‌లో మహిళా ఉద్యోగులపై సాగుతున్న వేధింపులపై విచారణ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ‘‘శాప్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని మా దృష్టికి వచ్చింది. కానీ... లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందలేదు. మీడియాలో వచ్చిన కథనాన్ని సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగినులు వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అయితే... శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి మాత్రం క్రీడా సంఘం ముసుగులో కొంతమంది తమపై దుష్ప్రచారం చేస్తున్నారని... శాప్‌లో కొందరి అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేధింపులపై ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. పైగా... ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారంటున్న ‘కె.మరియమ్మ’ అనే పేరుతో శాప్‌లో ఎవరూ పనిచేయడంలేదని ఎండీ తెలిపారు.