సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషి చేయాలని కర్నూల్ జిల్లా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో భ్రూణ హత్యలు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా పీసీ పీఎన్టీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బహుమతి అందిస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.50వేల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆదోని డివిజన్ పరిధిలో ఉన్న 39 స్కానింగ్ కేంద్రాలను ప్రతి మూడునెలలకోసారి తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్కానింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సత్యవతి, ఏరియా ఆసుపత్రి సుపరిండెంట్ డా. లింగన్న, గైనకాలాజిస్ట్ డా. మాధవీలత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ సహాయకులు సంగీత, టూటౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్, డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు.