ఓ వీడియోను షేర్ చేసిన ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని నేటిజన్లకు సూచించారు. ఇదిలావుంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కృత్రిమ మేధకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను పంచుకున్నారు.
ఇందులో ఓ వ్యక్తి ఏఐ సాయంతో ఫేక్ వీడియో చేయడం గురించి మాట్లాడుతుండడాన్ని గమనించవచ్చు. అయితే ఆ వ్యక్తి తల భాగంలో సెలెబ్రిటీల తలలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి, అచ్చం ఆ సెలెబ్రిటీలు మాట్లాడుతున్నట్టుగానే భ్రమింపజేశారు. కింద ఉన్న ఒరిజినల్ వ్యక్తి చెబితే తప్ప అది ఫేక్ వీడియో అని గుర్తించలేని విధంగా కృత్రిమ మేధతో మాయాజాలం చేశారు. ఇదంతా ఏఐ ద్వారానే సాధ్యమైంది. దీనిపై ఆనంద్ మహీంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక మేలుకొలుపు వంటిదని హెచ్చరించారు.
"ఇలాంటి మోసపూరిత కంటెంట్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఓ సమాజంలో భాగంగా మనం ఏ మేరకు సన్నద్ధమవుతున్నాం అనేది ఆలోచించాలి. ఇలాంటివి కొద్దిగా వినోదభరితంగా ఉండొచ్చేమో కానీ... అవే అత్యంత దారుణమైనవి, ప్రజల మధ్య చిచ్చురేపేవి అయితే ఏంచేస్తాం? ఇటువంటి శక్తిమంతమైన వ్యవస్థలతో రూపొందించిన ఫేక్ కంటెంట్ నుంచి రక్షణ కోసం తనిఖీ వ్యవస్థలు ఉండాలి కదా?" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.